మన భారత తపాలా శాఖ 1-11-2017 న ఆదికవిగా కీర్తించబడిన నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పైన తపాలా బిళ్ళలు విడుదల చేశారు. ఇదే సందర్భంగా కన్నడ కవి ముద్దన పై కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు . ఈ మూడు తపాలా బిళ్ళలు ఒకే తపాలా కవరు పై కర్ణాటక రాష్ట్ర ఆతరణ దినోత్సవం నవంబర్ ఒకటో తేదీన (మన పూర్వ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం కూడా అదే) బెంగళూరులో విడుదల చేశారు.
కవి ముద్దన, ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం
ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం చారిత్రిక ప్రసిద్ధి చెందిఉంది. ఇక్కడ ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. అలాగే పంచారామాలలో ద్రాక్షారామం కూడా ఒకటి.
ఆదికవి నన్నయ్య, రాజరాజ నరేంద్రునికి మహా భారత గ్రంధాన్ని ఇస్తున్న నన్నయ్య
పూర్వము ఆంధ్రదేశమునకు వేంగి దేశమని పేరు ఈ వేంగి దేశ పాలకుడు చాళుక్యరాజు రాజరాజనరేంద్రుడు. క్రీ.శ.1022 నుండి క్రీ.శ1063 వరకు 41 సంవత్సరములు పరిపాలించాడు. రాజధాని రాజమహేంద్రవరం. నన్నయ భట్టారకుడు రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. నన్నయ్యకు ఆదికవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్న బిరుదులు ఉన్నాయి. మహా భారత గ్రంధాన్ని తెలుగులో రాసిన కవిత్రయం లోమొదటివాడు. వ్యాస భారతములో మొదటి రెండుపర్వములను, ఆరణ్యపర్వమున కొంతభాగమును రచించి అర్ధాంతరంగా మరణించారు. తిక్కన , ఎఱ్ఱన దీనిని పూర్తి చేశారు. నన్నయ తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి కూడా రచించారని భావిస్తారు
Comments