A Commemorative postage stamp on
15-09-1960
BHARATHA RATNA Dr.MOKSHAGUNDAM VISVESWRAYA
భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962) బెంగుళూరు దగ్గర్లో ఉన్న ముద్దినేహళ్ళి అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టారు. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వికులు ఆంధ్ర నుండి మైసూరు ప్రాంతం వలసపోవటం జరిగింది. మైసూరు మహారాజు వారి ఆర్థికసహాయంతో పూనాలో ఇంజనీరింగు చదివి, 1884 లోబొంబాయిలో ప్రభుత్వ ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించారు. ఆ ఉద్యోగంలో ఆయన బొంబాయి పట్టణ అభివృద్దికి అపారమైన సేవలందించారు.
హైదరాబాద్ కు వరదలు వచ్చినపుడు సర్ M.V. నిజాం నవాబు ఆహ్వానంపై హైదరాబాదు వచ్చి రెండు రిజర్వాయరులు నిర్మించి, పట్టణ డ్రైనేజి పధకం తయారు చేసి, ఏడు నెలలలో కార్యక్రమం పూర్తిచేసి నవాబుగారి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం విశ్వేశ్వరాయ మైసూరు మహారాజు వారి అభ్యర్థనపై ఆస్థానంలో చీఫ్ ఇంజనీరుగా చేరి, అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసి 1912లో దివాన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విశ్వేశ్వరాయలోని క్రమశిక్షణ, పనియందు గౌరవాభిమానాలు, నిజాయితీ గురించి ఆ రోజుల్లో ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ, మనసా, వాచా, త్రికరణశుద్దిగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి పాటుపడిన ఆ మహవ్యక్తికి, మైసూరు మహరాజు శ్రీ కృష్ణరాజ వడియార్ ఒకసారి రెండులక్షలరూపాయలు బహుమానంగా ప్రకటించినప్పుడు దానికి సమాధానంగా 'నాకు ఖర్చులు లేవు. నేను చేసిన పనికి సరిపడినంత జీతం మీరిస్తున్నారు. ఇంకా వేరే బహుమతి ఎందుకు ఆ సొమ్మును దేశ అభివృద్దికి ఖర్చుపెట్టండి' అని అన్నారు. ఒకసారి తన స్వంత పని మీద యూరపు వెళ్ళవలసి వచ్చినప్పుడు బ్యాంకులో అప్పు తీసుకోబోగా, బ్యాంకు మేనేజరు వడ్డీ తగ్గించబోయారు. దాంతో ఆయన మండిపడి 'ఏం నేను అందరి మనుషుల్లాంటివాడినికానా? నాకు ఎందుకు ఈ తగ్గింపు? ఇలా అయితే నాకు మీ అప్పే అవసరంలేదు. మరొకరి దగ్గరకు వెళతాను' అన్నారు.
ఆయన మైసూరు రాష్ట్రప్రగతిలో మరపురాని పాత్ర వహించారు. కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాణం, మైసూరు యూనివర్శిటీ స్థాపన, మైసూరు బ్యాంకు స్థాపన, ఆయన కృషివల్లనే జరిగాయి. పనినే దైవంగా భావిస్తూ, సత్ప్రవర్తన, నిజాయితీ వ్యక్తిగత క్రమశిక్షణ గల శ్రీ విశ్వేశ్వరాయకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరమైన 'భారత రత్న' బిరుదునిచ్చి సత్కరించగా, దేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి వారిని గౌరవించాయి.
విశ్వేశ్వరయ్య గారి శతజయంతి రోజున భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదలచేశారు. శతవసంతాల నిండు జీవితాన్ని గడిపి ,జీవించి ఉండగానే తన తపాల బిళ్ళను చూసుకున్న ధన్య జీవిమన విశ్వేశ్వరయ్య. 1962 ఏప్రిల్ 14న స్వర్గస్థులైన భారతరత్న డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి జయంతిని, సెప్టెంబర్ 15 ప్రతి సంవ్సరం ఇంజినీర్స డే (Engineers' Day)గా జరుపుకుంటారు.
Comments