భారత ప్రభుత్వం ఇప్పటి వరకు వెలువరించిన షుమారు 2550 పోస్టల్ స్టాంప్స్ లో తెలుగు వారి పైన, తెలుగు జాతి సంస్కృతి పైన 68ఏళ్లలో విడుదల చేసిన తపాలా బిళ్లలు కేవలం 50 లోపు మాత్రమే. విడుదల అయిన ఈ తపాల బిళ్ళల లో కుడా మన వారి కృషి కంటే మన ప్రక్క న ఉన్న తమిళనాట ఉన్న తెలుగు సోదరుల కృషే ఎక్కువ.
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి వారికి, వారి మరణాన్తరం ప్రత్యేక తపాల బిళ్ళలు విడుదల చేయటం ఆనవాయితి. కలాం గారికి ఈమధ్యే తపాల బిళ్ళ విడుదల చేసారు. అయితే కీ.శే. పి.వి నరసింహారావు గారికి, నీలం సంజీవరెడ్డి గారికి ఇంతవరుకు పోస్టల్ స్టాంప్స్ విడుదల చేయలేదంటే వారిపట్ల, మన తెలుగు జాతి పట్ల ఎంత నిర్లక్షం ఉందొ తెలుస్తూనే వుంది.
జ్ఞానపీట్ అవార్డ్ లు పొందిన హిందీ, బెంగాలి, తమిళ్, కన్నడ, మలయాళ వంటి అన్ని భాషా కవులకు తపాలా బిళ్ళలు విడుదల చేసిన తపాలా శాఖ వారు మన విశ్వనాధ సత్యనారాయణ, రావూరి భరద్వాజలను విస్మరించారు. దేశంలో ఉన్న ప్రముఖమైన పశుజాతి అంటూ విడుదల చేసిన నాలుగు తపాల బిళ్ళలలో మన ఒంగోలు జాతి గిత్త కు చోటు దక్కలేదు. ఇలా ఒక సమూహం లో విడుదల చేసే తపాల బిళ్లలో దక్షిణ భారత దేశం నుండి ఎప్పుడు తమిళనాడుకే స్థానం ఉంటుంది. దీనిని బట్టి తెలుగువారిపై కేంద్రం చూపుతున్న చిన్న చూపు అర్ధమోతుంది. ఈ విషయంలో మన వారి నిర్లక్షం తేటతెల్లం అవుతుంది.
స్వామి నారాయణ తీర్థ, రామదాసు, క్షేత్రయ్య, సిద్దేంద్ర యోగి, పోతులూరి వీర బ్రహ్మం, ఆదిభట్ల నారాయణ దాసు, నాజర్, శ్రీశ్రీ, జాషువా, కొసరాజు, నార్ల, సంజీవదేవ్, దామర్ల రామారావు, బాపు రమణ, అక్కినేని నాగేశ్వరరావు, వంటి ఎందరో మహానుభావులు వారికి తపాలా బిళ్ళలు విడుదల చేయించాలన్న ఉహా ఈ మహనీయుల జయంతులు చేసిన/చేస్తున్న నిర్వహకులకు కాని ,ప్రభుత్వ పెద్దలకు కాని రాలేదు.
అలాగే ఇంకా తెలుగు భాషకు, జాతి వికాసానికి సేవ చేసిన గిడిగు రామమూర్తి, కోడి రామూర్తి, సి. పి. బ్రౌన్, దార్శినికులు సర్ అర్ధర్ కాటన్, డా. కె.యల్. రావు, వాసిరెడ్డి ప్రసాదరాజా, వెలగపూడి రామకృష్ణ, డా.నాయుడమ్మ, స్వాతంత్ర యోధులు ఉయ్యాలవాడ నర్శింహా రెడ్డి, కన్నెగంటి హనుమంతు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, కల్లూరి చంద్రమౌళి, కడప కోటిరెడ్డి, గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మరి ఎందరో తెలుగు ప్రముఖులుకు శాశ్విత గుర్తుగా తపాలా బిళ్ళలు విడుదల చేయించి వారిని గౌరవించ వలిసిన బాధ్యత తెలుగు వారందరిపైన వుంది.
తెలుగు వారి గత వైభవాన్ని చాటే అమరావతి, లేపాక్షి, కాకతీయుల శిల్పకళకు, ఏటికొప్పాక, కొండవీటి బొమ్మలకు గుర్తింపు కలిగేలా తపాల బిళ్ళ వచ్చేలా కృషి చేయాలి. ఉత్సవాల పేరుతో ఉరికే డబ్బు దుబారా చేయటం కాదు. కొద్ది కాలం మాత్రమే ఉండే ప్రత్యేక సంచకలు ప్రచురిస్తారు కాని శాశ్వితంగా ఉండే తపాలా బిళ్ళను తిసుకురావాలన్న ఆలోచన మన వారికి కలగటం లేదు. చిత్త సుద్ది లేని ఇలాంటి సభల నిర్వాహణ వల్ల తెలుగు భాషకు, జాతికి మేలు జరుగుతుందని అనుకోవటం ఒక భ్రమ.
ఈ విషయంలో పోరుగునవున్న తమిళ సోదరుల నుండి ఉత్తేజం పొందాలి.ఇప్పటికైనా కళ్ళుతెరిచి తెలుగు జాతి సంస్కృతి కి చరిత్రకి సంభందించిన తపాలా బిళ్ళలు కొన్నైనా కొత్త సంవత్సరంలో వచ్చేలా కృషి చేయాలి.తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచంలో చాటాలి.
Comments
కొణతం దిలీప్
hridayam.wordpress.com